శాంసంగ్ ఉద్యోగులకు జాక్‌పాట్.. ఒక్కొక్కరికి రూ.3.25 కోట్ల బోనస్.. 78 వేల మందికి ఇస్తోన్న కంపెనీ!

  • ఏఐతో పెరిగిన లాభాలు.. ఉద్యోగులతో పంచుకుంటున్న శాంసంగ్
  • చిప్ విభాగంలోని 78 వేల మందికి ఒక్కొక్కరికి సగటున రూ. 3.25 కోట్ల బోనస్
  • భారీ బోనస్ ప్యాకేజీకి ఆమోదం తెలిపిన ఉద్యోగ సంఘం
  • ఈ ఒప్పందంతో తప్పిన 18 రోజుల సమ్మె ముప్పు
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ తమ ఉద్యోగులకు భారీ కానుక ప్రకటించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో నెలకొన్న అనూహ్యమైన వృద్ధి కారణంగా కంపెనీ చిప్ విభాగం లాభాల పంట పండించడంతో ఆ ఫలాలను ఉద్యోగులతో పంచుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా చిప్ డివిజన్‌లోని ప్రతి ఉద్యోగికి సగటున 3,40,000 డాలర్లు (దాదాపు రూ. 3.25 కోట్లు) బోనస్‌గా అందనుంది. ఈ మేరకు కంపెనీ యాజమాన్యానికి, కార్మిక సంఘానికి మధ్య కుదిరిన ఒప్పందానికి ఉద్యోగుల నుంచి ఆమోదం లభించింది.

తాజాగా జరిగిన ఓటింగ్‌లో కంపెనీ అతిపెద్ద కార్మిక సంఘం ఈ భారీ బోనస్ ప్యాకేజీకి ఆమోదం తెలిపింది. ఈ ఓటింగ్‌లో 95 శాతానికి పైగా అర్హులైన సభ్యులు పాల్గొనగా, వారిలో 73.7 శాతం మంది ఒప్పందానికి అనుకూలంగా ఓటు వేశారు. ఈ ఒప్పందంతో దాదాపు 18 రోజుల పాటు జరగాల్సిన సమ్మె ముప్పు తప్పింది. ఈ సమ్మె జరిగి ఉంటే శాంసంగ్ ఉత్పత్తికే కాకుండా ప్రపంచ సరఫరా వ్యవస్థకు కూడా తీవ్ర అంతరాయం కలిగి ఉండేది.

ప్రస్తుతం ఏఐ డేటా సెంటర్ల కోసం మెమరీ చిప్‌లకు విపరీతమైన డిమాండ్ నెలకొంది. ప్రపంచంలోనే అతిపెద్ద మెమరీ చిప్ తయారీదారుల్లో ఒకటైన శాంసంగ్ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంది. దీంతో గడిచిన త్రైమాసికంలో కంపెనీ చిప్ విభాగం ఆదాయం ఏకంగా 49 రెట్లు పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఉద్యోగులకు లాభాల్లో వాటా ఇవ్వాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది.

ఈ బోనస్ శాంసంగ్ ఉద్యోగులందరికీ కాకుండా కేవలం ప్రాసెసర్లు, మెమరీ చిప్‌లను తయారు చేసే చిప్ విభాగానికే వర్తిస్తుంది. ఈ డివిజన్‌లో సుమారు 78,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఒప్పందం ప్రకారం సెమీకండక్టర్ విభాగం ఆపరేటింగ్ ప్రాఫిట్‌లో 10.5 శాతాన్ని ఉద్యోగులకు షేర్ల రూపంలో, మరో 1.5 శాతాన్ని నగదు రూపంలో చెల్లిస్తారు. ఈ బోనస్ చెల్లింపుల కోసం కంపెనీ సుమారు 26.5 బిలియన్ డాలర్లు ఖర్చు చేయనుందని అంచనా. ఇటీవలే తైవాన్‌కు చెందిన టీఎస్‌ఎంసీ తర్వాత ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువను దాటిన రెండో ఆసియా కంపెనీగా శాంసంగ్ నిలిచింది. ఏఐ బూమ్ కారణంగా శాంసంగ్‌తో పాటు మరో ప్రముఖ మెమరీ చిప్ తయారీ సంస్థ ఎస్‌కే హైనిక్స్ కూడా గత ఏడాది తమ ఉద్యోగులకు భారీ బోనస్‌లు అందించడం గమనార్హం.

Samsung
Samsung bonus
Samsung employees
AI chips
memory chips
semiconductor industry
SK Hynix
chip division
artificial intelligence
TSMC

More Telugu News